రైస్ మిల్లర్లు వరి ధాన్యం వేగంగా అన్లోడ్ చేసుకోవాలి
వనపర్తి
రైస్ మిల్లర్లు వరి ధాన్యం లారీలను ఎక్కువ సమయం నిరీక్షింప చేయకుండా వేగంగా అన్లోడ్ చేసుకోవాలని, అదేవిధంగా ధాన్యంలో కోతలు విధించడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండలం పరిధిలోని సాయి గోపాల ఇండస్ట్రీస్‌ను సందర్శించి వరి అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా, మండల పరిధిలోని పాతపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం, చెలిమిల గ్రామ శివారులలో మెప్మా వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లర్లకు పలు కీలక సూచనలు చేశారు. రైస్ మిల్లర్లు వరి ధాన్యం లారీలను ఎక్కువ సమయం నిరీక్షింప చేయకుండా వేగంగా అన్లోడ్ చేసుకోవాలని, అదేవిధంగా ధాన్యంలో కోతలు విధించడానికి వీల్లేదని సూచించారు. రైతులు ధాన్యం యొక్క తేమ శాతం నిర్దేశించిన దానికన్నా తక్కువే ఇస్తున్నారన్నారు. వరి ధాన్యంలో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించవద్దని స్పష్టం చేశారు. అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, మిల్లులు మరియు గోదాముల వద్ద వేచి ఉన్న లారీలను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సూచించారు. ట్రక్ షీట్లను వెంటనే వాట్సాప్ ద్వారా పీపీసీ ఇన్‌చార్జ్‌లకు పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో ట్యాబ్ ఎంట్రీలు త్వరగా పూర్తై రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అవుతాయని తెలిపారు. పాత పల్లి, చెలిమెల గ్రామాల వద్ద వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి దాన్యం నమోదు రిజిస్టర్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ ఇన్‌చార్జ్‌లకు సూచనలు చేస్తూ, తేమశాతాన్ని పరిశీలించి వెంటనే రైతులను నిరీక్షింప చేయకుండా తూకం చేసి లోడ్ చేయాలని సూచించారు. రైతులు వరిని శుభ్రపరిచి తీసుకురావాలని అవగాహన కల్పించాలని తెలిపారు. దీంతో మిల్లర్లు కోతలు విధించే ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ప్రశ్నించగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కొంత లారీల కొరత ఉందని రైతులు చెప్పగా అదనపు లారీ లు పంపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వరి ధాన్యం తరలింపు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అదేవిధంగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని వర్షం వస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇన్చార్జిలకు సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, ఎంపీడీవో ప్రవీణ్, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.
