డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం గృహాల పనులను పరిశీలించి నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణాల ప్రస్తుత స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 48 గృహాలు స్లాబ్ దశలో ఉండగా, మరో 2 గృహాలు బేస్మెంట్ దశలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పనులు ఎప్పటి వరకి పూర్తవుతాయనే అంశంపై కాంట్రాక్టర్‌తో మాట్లాడిన కలెక్టర్, నిర్ణీత గడువులోగా అన్ని గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల వేగాన్ని మరింత పెంచాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పనులకు సంబంధించిన బిల్లులు త్వరితగతిన విడుదలయ్యేలా జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మాణాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించిన కలెక్టర్, అధికారులు కూడా పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో హౌసింగ్ పీడీ విటోభా, సంబంధిత శాఖ అధికారులు, పీ ఆర్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
