జిల్లాలో ఇండ్ల గణన ప్రక్రియకు ప్రజలు సహకరించాలి : అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్
వనపర్తి
జిల్లాలో 2027 జనగణనలో భాగంగా మే 11 నుండి ఇంటింటి గణన కార్యక్రమం ప్రారంభమైందని, ఇందుకోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించి, ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ గణనలో భాగంగా ప్రతి ఇంటి పరిస్థితి, ఇంటి నిర్మాణ స్వభావం, గదుల సంఖ్య, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, వంట ఇంధనం (LPG, కట్టెలు, విద్యుత్), వాహనాలు, ఇంటర్నెట్ సదుపాయం వంటి వివరాలను సేకరిస్తారని తెలిపారు. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ తదితర గృహోపకరణాల వివరాలను కూడా నమోదు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 33 ప్రశ్నల ద్వారా ఇంటి వివరాలను సేకరించే ఈ ప్రక్రియలో అధికారులు అడిగే ప్రశ్నలకు ప్రజలు సరైన సమాచారం అందించాలని సూచించారు. జనగణనలో భాగంగా ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రభుత్వ అధికారిక గుర్తింపు కార్డు ఉంటుందని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
జిల్లా ప్రజలందరూ సహకరించి గణన ప్రక్రియను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ విజ్ఞప్తి చేశారు.
