యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమిద్దాం
వనపర్తి
యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని, బీజేపీ నిరంకుశ విధానాలు దేశానికి ప్రమాదకరమని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఎఐవైఎఫ్ వనపర్తి జిల్లా 3వ మహాసభ వనపర్తి లోని సిపిఐ కార్యాలయం కటికనేని గోపాల్ రావ్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. మహాసభల సూచికగా యువజన సంఘ జెండాను ఎఐవైఎఫ్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ ఎగురవేశారు. ఈ సందర్బంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర. మాట్లాడుతూ వనపర్తి జిల్లా యువత నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాలు, పరిశ్రమల కొరత, నైపుణ్యాభివృద్ధి అవకాశాల లేకపోవడం, రైతు కుటుంబాల యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి, ప్రభుత్వ విద్య,వైద్య రంగాల నిర్లక్ష్యం, గిగ్ వర్కర్ల దోపిడీ వంటి సమస్యలు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టుతున్నాయన్నారు . ప్రజల పన్నులతో నడవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ ప్రయోజనాల కోసం యువత జీవితాలతో చెలగాటమాడుతున్న పాలకులను AIYF తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జిల్లా అభివృద్ధి అంటే కేవలం ప్రకటనలు కాదని, శాశ్వత ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, నాణ్యమైన వైద్యం, క్రీడా నైపుణ్య కేంద్రాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని వారు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థి–యువజన ఉద్యమాలు దేశ యువత ఆవేదనకు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. విద్యను హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చే విధానాలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టే పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి సమగ్ర సంస్కరణలు చేపట్టాలని AIYF డిమాండ్ చేస్తోందన్నారు. విద్యను కార్పొరేట్ లాభాల సాధనంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా పరిరక్షించాలన్నదే AIYF ఉద్యమాల ప్రధాన లక్ష్యమన్నారు.
సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కే. విజయరాములు. మాట్లాడుతూ నేటి యువత కేవలం ఉద్యోగం సాధించడం మాత్రమే కాకుండా, సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకునే సైద్ధాంతిక అవగాహన కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. “శాంతి,అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం” అనే AIYF సిద్ధాంతాన్ని యువతలో విస్తృతంగా తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై చైతన్యం పెంపొందిస్తూ ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాష్ట్ర మహాసభలు యువతకు సైద్ధాంతిక దిశానిర్దేశం చేసి, ప్రజా ఉద్యమాలను మరింత శక్తివంతం చేసే వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జ శ్రీనివాసులు. మాట్లాడతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలు, విద్య–ఉపాధి రంగాలపై పెరుగుతున్న కార్పొరేట్ ఆధిపత్యం యువత ఆశయాలను దెబ్బతీస్తున్నాయన్నారు . మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోకూడదన్నారు. ఈ పరిస్థితుల్లో యువతను ఐక్యం చేసి, విద్య–ఉపాధి–సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయడం ఎఐవైఎఫ్ తీసుకుందన్నారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేసి, వనపర్తి నుంచే ప్రజా ఉద్యమాల కొత్త అధ్యాయాన్ని ప్రారంబించాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ మహాసభలో ఎఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ. కూతుబ్, సీపీఐ జిల్లా నేత, ఎఐవైఎఫ్ జిల్లా నిర్మాణ భాద్యులు రమేష్,ఎఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్,ఎఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు విష్ణు, మహబూబ్, పరమేష్, సంతోష్, ప్రసాద్, వెంకటేష్, అశోక్, మోహన్, శ్రీకాంత్, బాలకృష్ణ, మురళి, రాజేష్, భాను ప్రకాష్, వెంకట్ స్వామి, రాము, రామాంజనేయులు లతో పాటు వివిధ మండలాల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు.
