ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ
వనపర్తి
ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ సునిత రెడ్డికి నేరుగా వినిపించారు. ప్రతి ఫిర్యాదును జిల్లా ఎస్పీ స్వయంగా శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టబద్ధంగా, పారదర్శకంగా , వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి నిర్వహణ యొక్క అసలు ఉద్దేశ్యం. ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ తక్షణ స్పందన, సమస్యల పరిష్కారానికి చూపిన చొరవపై ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసం కలిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
