స్కావెంజర్ పనులు చేయాలని వేధిస్తే ఊరుకోం : మోష
వనపర్తి
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం స్లీపర్లను కొందరు హెడ్మాస్టర్లు టీచర్లు స్కావెంజర్లు పనులు కూడా చేయాలని వేధిస్తున్నారని ఇలా చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్లీపర్ల యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడు మోష హెచ్చరించారు. ఆదివారం వనపర్తి ఆఫీస్ లో అభిమన్యు అధ్యక్షతన నిర్వహించిన వనపర్తి జిల్లా స్వీపర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ బడులలో పార్ట్ టైం స్వీపర్లుగా వారిని మొదట రూ. 75 వేతనంపై నియమించిందని తర్వాత పలు పోరాటాల ఫలితంగా రూ.1643, ఇప్పుడు రూ. 5200 కు పెంచిందన్నారు. వారికి రోజుకు రూ. 170 మాత్రమే పడుతుందన్నారు. ఉపాధి హామీ కూలికి కూడా రోజు రూ.307 ఇస్తున్నారని ఇది అంతకంటే చాలా తక్కువ అన్నారు.ఉదయమే పాఠశాలలు ఊడ్చి శుభ్రం చేయడం, తాగునీళ్లు పెట్టటం మాత్రమే వారి పనులు అన్నారు. తర్వాత ప్రభుత్వం పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రం చేయటం మొక్కలకు నీళ్లు పెట్టటానికి అదనంగా స్కావెంజర్లను నియమించింది అన్నారు. ఏవో కారణాలవల్ల స్కావెంజర్లను ప్రభుత్వం తొలగించిందని,ఈ కారణంగా పాఠశాలల్లో ఉండే హెచ్ఎంలు స్వీపర్ పనితో పాటు స్కావెంజర్ పనులు కూడా చేయాలని, రోజంతా పాఠశాలలోనే తమతో పాటు పని చేయాలని వేధిస్తున్నారన్నారు. పార్ట్ టైం స్వీపర్లు రూ. 170 వేతనానికి రోజంతా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. తమను వేధిస్తున్నట్లు పలు పాఠశాలల స్వీపర్లు ఫిర్యాదులు చేస్తున్నారని, కొత్తకోట మండలంలో వేధింపులు మరి ఎక్కువగా ఉన్నాయన్నారు. పార్ట్ టైం స్వీపర్లు ఫుల్ టైం ఎలా పనిచేస్తారని, హెచ్ఎంలు ఉపాధ్యాయులు ఆలోచించాలన్నారు. స్కావెంజర్ల పనులు స్వీపర్లను చేయమని వేధించటం ఆపాలన్నారు. వారికి చేతనైతే ప్రభుత్వం నుంచి ఫుల్ టైం ఉద్యోగులుగా ఆర్డర్ ఇప్పించి అప్పుడు అడగాలన్నారు. స్వీపర్లను రెగ్యులర్ చేయాలని కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దశల వారి పోరాటం చేస్తామన్నారు. ఈనెల 30వ తేదీన పెబ్బేర్ లో ఏఐటియుసి జిల్లా మహాసభలు జరుగుతాయని జిల్లాలోని స్వీపర్లు సభలకు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, స్వీపర్ల నేతలు గోపాల్ గౌడ్ మాలిక్ శోభారాణి చంద్రమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
