తగ్గిన వర్షాలతో రైతుల ఆందోళన ఆదుకోవాలి : రాబర్ట్
వనపర్తి
ఎల్ నినో ప్రభావంతో తగ్గిన వర్షాలతో సాగుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి రాబర్ట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రం 17 జిల్లాలలో లోటు వర్షపాతం నమోదయిందన్నారు. వనపర్తి జిల్లాలో వర్షాలు తగ్గటంతో 7.39 శాతం భూమి సాగు అయిందన్నారు. పడిన కొద్దిపాటి వర్షాలకే పత్తి కంది తదితర మెట్ట పంటలను వేసినా మొలకెత్తక నష్టపోయారన్నారు. భూగర్భ జలం తగ్గటంతో బోర్లు కూడా నీరు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోందని,వరికి బదులు ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు పండించే రైతులకు ఎకరాకు రూ. 8000 ప్రోత్సాహక నగదు అందజేయాలన్నారు. నకిలీ కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, మెట్ట పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. పంట మార్పిడి కోసం అవసరమైన చర్యలు అవగాహన కల్పించాలన్నారు. పండించిన మెట్ట పంటకు గ్యారెంటీగా మద్దతు ధర లభించేందుకు మార్కెట్ శక్తులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అన్ని స్థాయిల్లో ఆదుకునేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు కే ఎల్ ఐ భీమా జూరాల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలన్నారు. పాలమూరు రంగారెడ్డి మొదటి మోటారు వెట్ రన్ కు అధికారులను సీఎం ఆదేశించారని, ఇది శుభ పరిణామమని, అలాగే ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే రైతులను సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. నేతలు రమేష్, యూసుఫ్, వంశీ పాల్గొన్నారు.
