అధికారులు బాధ్యతాయుతంగా ప్రజల అర్జీలని సత్వరం పరిష్కరించి న్యాయం చేయాలి
వనపర్తి
దళారీ వ్యవస్థ అనేది సమూలంగా లేకుండా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల అర్జీలపై నిర్లక్ష్యం వద్దని, వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఉన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు తోడుగా అదనంగా మరిన్ని పథకాలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. విద్యా వైద్యంపై ప్రధాన దృష్టి సారించి, వీటికి ప్రధానంగా నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రజల అర్జీలను, దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. దళారీ వ్యవస్థ అనేది సమూలంగా లేకుండా చేయాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల అర్జీలపై నిర్లక్ష్యం వద్దని, వాటిని వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఎటువంటి సమస్య లేకుండా భూభారతి కి సంబంధించి రైతుల నుంచి వచ్చే అర్జీలను శరవేగంగా పరిష్కరించాలని సూచించారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు పరిమితులకు లోబడి ఇండ్లను నిర్మించుకోవాలని, పరిమితికి మించి ఇండ్ల నిర్మాణం చేసుకోవడం ద్వారా తిరిగి అప్పులపాలయ్యే అవకాశం ఉంటుందని ఆ దిశగా అధికారులు పర్యవేక్షణ సాగించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతి వ్యక్తికి సరైన సమాచారం అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 65 ఏళ్లలో కేవలం రాష్ట్ర అప్పు రూ. 65 వేల కోట్లు ఉంటే, గత ప్రభుత్వం పది ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. యువత పక్కదారి పట్టకుండా, డ్రగ్స్ వైపు మల్లకుండా క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయం ఛైర్మెన్ గోవర్ధన్ సాగర్, వనపర్తి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ మాధవి, పెబ్బేరు మునిసిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కొత్తకోట మునిసిపల్ ఛైర్పర్సన్ అరుణ, ఆత్మకూరు మునిసిపల్ ఛైర్పర్సన్ నాగమణి, అమరచింత మునిసిపల్ ఛైర్పర్సన్ సువర్ణ, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్డివో సుబ్రహ్మణ్యం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
