డీసీఎంను తాళ్లతో లాగి సిపిఐ తీవ్ర నిరసన
వనపర్తి
పానగల్ మండలం మూడు గ్రామాల్లో కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వాణిజ్యగ్యాస్ సిలిండర్ ధర పెంపుపై సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. కేతేపల్లి లో డీసీఎం వాహనాన్ని తాళ్లతో కట్టి గ్రామపంచాయతీ వద్ద నుంచి కొంత దూరం లాగి డీజిల్ కొనలేక వాహనాలను ఇక తాళ్లతో లాగాల్సిందేనని సంకేతాలు ఇచ్చి నిరసన తెలిపారు. వెంగలాయపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్రజెండాలు ధరించి ధరల పెంపుపై నిరసన తెలిపారు. తెల్ల రాళ్లపల్లి బస్టాండ్ వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ వాణిజ్య వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 కు పెంచిందని దానితో హోటళ్లలో తినుబండారాలపై విపరీతంగా ధరలు పెరిగాయి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచమని ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన నరేంద్ర మోడీ ఎన్నికలు ముగియగానే లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఏకంగా రూ.3.50 పెంచి ప్రజలను దగా చేశారన్నారు. పెట్రోల్ పై మరో వారం రోజుల్లో రూ. పది పెంచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రష్యా చమురును తక్కువ ధరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడి కొనడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విజర్లాండ్ నుంచి నల్లధనం తెచ్చి ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. నరేంద్ర మోడీ ఏనాడూ కార్మికుల కర్షకుల సమస్యలను పట్టించుకోలేదని సంపన్నులకు ఊడిగం చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలను లేబర్ కోడులు తెచ్చి నిర్వీర్యం చేశారని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని, పని గంటలు 8 నుంచి 12 కు పెంచారని మోదీ ప్రజా వ్యతిరేక పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ పోరాడుతుందని బిజెపి ప్రజా సమస్యలను గాలికి వదిలి జైశ్రీరామ్ పేరుతో అధికారంలో కొనసాగుతోందని విమర్శించారు. బంగారం కొనదని, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని, పొదుపు పాటించాలంటున్నారని, సంసార జీవితం గడిపే వారికి వాటి అవసరం తెలుస్తుందనినరేంద్ర మోడీకి ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని వెంటనే తగ్గించాలని లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వంక గోపాల్, చందు,సంగనమోని రాముడు తదితరులు ధరల పెంపుకు నిరసన తెలుపుతూ డప్పులు కొట్టుకుంటూ పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, వార్డు సభ్యురాలు కురుమమ్మ, మాజీ వార్డు సభ్యుడు కమ్మావుల పెంటయ్య, రామదాసు, చిన్న ముత్యాలు, మంగలి వెంకటయ్య, బుడ్డ బాలస్వామి, హోటల్ రాముడు, సంగనమోని రాముడు, దొడ్ల బీరయ్య, సిపిఐ వెంగలాయిపల్లి గ్రామ కార్యదర్శి మల్లెపు బాలస్వామి, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ కాకం బాలస్వామి, గ్రామ శాఖ కార్యదర్శి సహదేవుడు సీనియర్ నాయకులు ఎర్రగుంట రాముడు, కాకంరాముడు, పరంధాములు, తదితరులు పాల్గొన్నారు.
