VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

రైతులు పండించిన వడ్లను అమ్మడానికి రైతులు ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదనీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండించిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులకు పూర్తి భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కల్యాణ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో క‌లిసి మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి, అన్నదాతల శ్రేయస్సును కాపాడటమే రాష్ట్ర ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు, కొనుగోలుదారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడా పారదర్శకత లోపించకూడదని ఆదేశించారు. రైతు కష్టానికి తగిన ప్ర‌తిఫ‌లం దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కొనుగోలు ప్రక్రియలో ఎవరూ ఎవరినీ బతిమాలుకునే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. కొనుగోలు కేంద్రంలోనే నిబంధనల ప్రకారం వడ్లు నాణ్యత చూసుకొని తూకం చేసి రైతుకు అక్కడే రశీదు ఇచ్చేయాలని అంతే తప్ప రైతు లారీ వెంబడి మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వడ్లు నాణ్యతను బట్టి తరుగు తాలు కొనుగోలు కేంద్రంలోనే జరగాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లారీ మిల్లుకు వచ్చిన తర్వాత తరుగు అనే మాట మాట్లాడకుండా వడ్లు దించుకోవాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులు నాణ్యమైన వడ్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన ధాన్యం మిల్లు ఆడించి ఎఫ్.సి.ఐ.కి క్వింటాలుకు 68 కిలోల చొప్పున తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, నాణ్యమైన వడ్లు ఇవ్వకపోవడం వల్ల మిల్లర్లు నష్టపోతున్నారని మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఎఫ్.సి.ఐ.కి ఇచ్చే 68 కిలోల బియ్యంలో నూకలు, సరిగ్గా గింజలు నిండనివి, ఇతరత్రా కలుపుకొని దాదాపు 23 శాతం ఉంటుందని అందువల్ల మిల్లర్లు నష్టపోయే అవకాశమే లేదని, రైతులకు సహకరించి వారిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఈ స‌మావేశంలో జిల్లా క‌లెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ , మార్కెట్ కమిట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, సివిల్ సప్లైస్ అధికారులు, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులు, రైస్ మిల్లుల ప్రతినిధులు, వడ్లు కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 05 11 at 6.14.57 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top