సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి
సకల సదుపాయాలతో రూపొందించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి కోరారు. వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంతంలో నూతనంగా సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయంలోని మొదటి అంతస్తులో శుక్రవారం రిజిస్ట్రేషన్ అస్యూరెన్స్ కార్యాలయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయం పూర్తి అయి దాదాపు సంవత్సరం పైగా అవుతున్నప్పటికీ షాపుల అద్దె ఎక్కువగా ఉండటంతో షాపులు తీసుకోడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాలేదన్నారు. పరిస్థిని గమనించి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని నిర్ణయించిన రేట్లలో సగానికి తగ్గించి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను పంపించగా అట్టి ప్రతిపాదనలు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమీకృత మార్కెట్ లో షాపులు పొంది ప్రార్భోత్సవాలు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, దస్తావేజు లేఖరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత మార్కెట్ సముదాయంలో ఇంకా డిమాండు ఉందని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అవసరమైన వారందరికీ షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలో ఉన్న టౌన్ హాల్ ను సైతం వినియోగంలోకి తీసుకువస్తామని అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో బంగారు షాపులను నిర్మించి ఇక్కడే గోల్డ్ బజార్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయంలో షాపులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడిఉన్న సమీకృత మార్కెట్ సముదాయాని శాసన సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల షాపు ధరలు తగ్గించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సామాన్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాపులకు మాత్రమే డిమాండు ఉంటుందనీ కానీ పై అంతస్తులో తీసుకోడానికి సామాన్యంగా ఎవరు ఇష్టపడరు అన్నారు. అందుకే పై అంతస్తులో రిజిస్ట్రేషన్ శాఖ పెట్టడం వల్ల డిమాండు పెరిగి అన్ని షాపులకు డిమాండు పెరిగిందన్నారు. పట్టణం మధ్యలో సమీకృత మార్కెట్ ఉండటం చాలా బాగుందని తెలిపారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అసంపూర్తిగా వదిలిన భవనానికి దాదాపు 23 లక్షలు అదనంగా ఖర్చు చేసి ట్రాన్స్ ఫార్మా సైతం ఏర్పాటు చేసి నేడు వినియోగంలో తెచ్చినందుకు శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్ర, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
