సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)
కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి
పెబ్బేరు మండల కేంద్రంలో జి సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించి విజయవంతం చేయాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ప్రచారాన్ని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు మూలస్తంభమని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు, ఓటరు జాబితాలో పేరు లేకపోయిన వారు, చిరునామా మార్పు, పేరు లేదా ఇతర వివరాల సవరణ, తొలగింపు వంటి సేవలను ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా పొందవచ్చని తెలిపారు. ఓటరు జాబితా పరిశుభ్రంగా, పారదర్శకంగా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే సంబంధిత బూత్ లెవల్ అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ప్రజలకు ఈ కార్యక్రమంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ చేపట్టిన ఆటో ప్రచారం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి వార్డు, ప్రతి వీధి, ప్రతి కాలనీకి ఈ ప్రచారం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి ఈ కార్యక్రమం గురించి తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, బాధ్యతాయుతమైన ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకునేందుకు ముందుగా ఓటరు జాబితాలో పేరు నమోదు కావడం తప్పనిసరి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ లు సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు
