ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజేషన్ ప్రక్రియ
వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు పట్టణంలోని కేడీఆర్ నగర్, చందాపూర్ గ్రామాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి బీఎల్‌వోలు, సూపర్వైజర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి బీఎల్‌వో రోజుకు కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వాలంటీర్ల సహాయాన్ని తీసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలు నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందజేయాలని విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ఫారాలను సమర్పించని పక్షంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోయే అవకాశం ఉందని ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన కలెక్టర్, 2002 ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాలను గుర్తించడంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. అనంతరం కేడీఆర్ నగర్‌లో తనిఖీ నిర్వహించిన కలెక్టర్, కొంతమంది బీఎల్‌వోలు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేసి, సకాలంలో వాటిని సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కఠినంగా హెచ్చరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
