VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతు కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల 40 వేల 286 మంది రైతులకు రూ.8,759.60 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయడం రైతుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వనపర్తి జిల్లాలో 1,83,011 మంది రైతులకు రూ.212.57 కోట్ల రైతు భరోసా నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. అలాగే వనపర్తి నియోజకవర్గంలోని 92,115 మంది రైతులకు కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.99.04 కోట్లను జమ చేయడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. రైతు సంక్షేమాన్ని మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు భరోసాతో పాటు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలతో రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అనేక వ్యవసాయ రాయితీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. వరి, వేరుశనగ, కంది, ఆముదం వంటి పంటల విత్తనాలపై, ఎరువులపై, ట్రాక్టర్లు, రోటావేటర్లు, కల్టివేటర్లు, గొర్రులు, స్ప్రేయర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై అందే సబ్సిడీలను రద్దు చేసి ఒక్కో రైతుకు లభించాల్సిన రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ప్రభుత్వ సహాయాన్ని దూరం చేసిందన్నారు. నేడు అదే రైతు సంక్షేమాన్ని తిరిగి గాడిలో పెట్టి రైతుకు ప్రతి దశలో అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు.రైతు నవ్వితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రైతు సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ విజయానికి అసలైన కొలమానం. రైతు భరోసా నిధుల విడుదల అందుకు ప్రత్యక్ష నిదర్శనం. రైతును కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి ఎకరానికి, ప్రతి రైతు కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తుంది” అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

whatsapp image 2026 07 11 at 1.55.54 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top