జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో వనపర్తి పోలీసుల విజయపతాకం : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి
జూలై 6 నుంచి 8 వరకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్న జోగులాంబ జోన్–7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ డ్యూటీ మీట్లో శాస్త్రీయ దర్యాప్తు, ఫింగర్ ప్రింట్స్, సహాయక శాస్త్రీయ పద్ధతులు, యాంటీ సబోటేజ్ చెక్,ఫోరెన్సిక్ సైన్స్,ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, ప్యాకింగ్, హ్యాండ్లింగ్,బాంబ్ డిస్పోజల్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో వనపర్తి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అసాధారణ ప్రతిభ కనబర్చి మొత్తం 11 పతకాలు (5 బంగారు, 5 రజత, 1 కాంస్య) సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ విజయంతో పలువురు అధికారులు, సిబ్బంది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి విజేతలను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ డ్యూటీ మీట్లు పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలను మరింత పదును పెట్టే అత్యంత కీలకమైన వేదికలు అని అన్నారు. శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, నేరాల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, కంప్యూటర్ ఆధారిత పోలీసింగ్ వంటి అంశాల్లో సిబ్బందికి ప్రాయోగిక అనుభవాన్ని ఈ పోటీలు అందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే నైపుణ్యం, క్లిష్ట పరిస్థితులను వేగంగా విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ పోటీలు పోలీసు సిబ్బందిని తీర్చిదిద్దుతాయని అన్నారు. అలాగే, రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీసు సిబ్బందితో అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తమ విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని, ఆధునిక పోలీసింగ్‌లో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతుందని ఎస్పీ వివరించారు. జోన్ స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితో కఠినంగా సాధన చేసి రాష్ట్ర స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి వనపర్తి జిల్లా పోలీసులకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, షీ టీం, భరోస,ఎస్సై, అంజద్, జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
