కరువు మండలాల్లో సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలి : సిపిఐ
వనపర్తి
జిల్లాలో కరువు పీడిత మండలాలుగా ప్రకటించిన 11 మండలాల్లో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి సిపిఐ ఆఫీసులో మాట్లాడుతూ.. చిన్నంబాయి, రేవల్లి, మదనాపూర్, శ్రీరంగాపూర్ మండలాల్లోనూ కరువు పరిస్థితులు ఉన్నాయని అధికారులు అక్కడి పరిస్థితులను పునసమీక్షించి వాటిని కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి రైతు కూలీలను ఆదుకోలేదని అలాంటి పరిస్థితి పునరావృత్తం అయితే సిపిఐ పక్షాన రైతుల కూలీలను సమీకరించి పోరాడుతామన్నారు. ఎండిపోయిన పంటలను గుర్తించి ఎకరానికి రూ. 30000 నష్టపరిహారం ఇవ్వాలని, పంట రుణాలను మాఫీ చేయాలన్నారు. కరువులో పంటలు పండకపోవటంతో సన్న బియ్యం ధర రూ. 75 నుంచి 95 రూపాయలు ఉందని సామాన్యులు కొనలేరని రేషన్ షాప్ ల ద్వారా మనిషికి 10 కిలోల సన్నబియ్యం ఇవ్వాలన్నారు. చెరువులు కుంటలు బావులు ఎండిపోవటంతో పశువులకు గొర్రెలకు గడ్డి నీళ్లు దొరికే పరిస్థితి లేదని పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాలు లేక వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలకు పని కల్పించేందుకు జిరాంజీ పథకంలో ఎక్కువ పనులను గుర్తించి కూలి కల్పించాలన్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం అర్హులను గుర్తించిందని వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలన్నారు.
జూరాల అయకట్టుకు డిసెంబర్ 15 వరకు నీళ్లు ఇవ్వాల్సిందే
జూరాలయకట్టుకు నవంబర్ మూడో తేదీ వరకే నీళ్లు ఇస్తామని సంబంధిత అధికారులు ప్రకటించటం సరికాదని డిసెంబర్ 15 వరకు నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని రమేష్ డిమాండ్ చేశారు. నవంబర్ 3 తో నీటిని ఆపేస్తే ఒక్క గింజ కూడా రైతు చేతికి రాదని అప్పులతో ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కర్ణాటక నుంచి మూడు టీఎంసీల నీళ్లు తెస్తామని హామీ ఇచ్చిన అమలు చేయలేదన్నారు. తాగునీళ్ల కోసం రిజర్వాయర్లో నీళ్లు ఉంచాల్సి వస్తోందని అధికారులు చెప్పటం సరికాదన్నారు. ప్రస్తుతం ఉన్న నీటిని పంటలకు వదిలి కర్ణాటక నుంచి తెస్తాం అన్న మూడు టీఎంసీల నీళ్లు తెచ్చి వాటిని తాగునీటికి వాడాలన్నారు. నవంబర్ మూడు వరకే నీటిని ఆపితే సిపిఐ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పోరాటం చేస్తామన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, పట్టణ కార్యదర్శి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ నేతలు లక్ష్మీనారాయణ, శివ, జయమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు
