రామ మందిరం అవకతవకలపై మోదీ మౌనం వీడాలి: సిపిఐ
వనపర్తి
అయోధ్య రామ మందిరం నిర్మాణంలో విరాళాలలో జరిగిన అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా విరాళంగా పంపిన సొమ్ము గోల్మాల్ జరిగిందని, హుండీ సొమ్ము చోరీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సిట్ వేసి చేతులు దులుపుకున్నారని, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాముని పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నిధుల గోల్మాల్పై సిబిఐ విచారణ చేపట్టకుండా చివరకు రాముడిని కూడా మోసం చేశారన్నారు. అనేక విషయాలపై మాట్లాడుతున్న నరేంద్ర మోడీ రామ మందిరం విరాళాల్లో అవకతవకలు, ఉండి డబ్బు చోరీపై నరేంద్ర మోడీ, బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపటం లేదన్నారు. బిజెపి నేతల తెర వెనుక పాత్ర లేకుండా ఇవన్నీ జరగమన్నారు. ఈ సంఘటనల్లో రామ మందిరం ప్రధాన పూజారి, ట్రస్ట్ చైర్మన్ వంటి ముఖ్యులను వదిలేసి సామాన్య ఉద్యోగులనే బాధ్యులను చేయటం దారుణం అన్నారు. యుద్ధం వచ్చిందని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని ఫలితంగా అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాయని, మరి దేశంలో ఎప్పుడు తగ్గిస్తారని ప్రశ్నించారు. దేశంలో ఏక పార్టీ పాలన తెచ్చేందుకు నిస్సిగ్గుగా ప్రలోభాలకు గురిచేసి ప్రాంతీయ పార్టీలను చీల్చి ఎంపీలను పార్టీలో చేర్చుకోవడం దుర్మార్గమన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలను చీల్చారని, త్రిపురలో అనామక పార్టీలో ఇతర పార్టీల ఎంపీలు చేరటం వెనుక బిజెపి పాత్ర ఉందన్నారు. సర్ పేరుతో కోట్లాది సామాన్య ప్రజల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. సర్ కోసం ఇచ్చే పత్రాలు నింపటం సామాన్యులకు రాదని, వారి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతు భరోసా రెండు విడతలు ఎగ్గొట్టారని, ఒక విడత రెండు ఎకరాలకు మాత్రమే వేశారని ఇప్పుడు మళ్లీ ఈనెల 30వ తేదీన ఖాతాల్లో రైతుబంధు వేస్తామని చెబుతున్నారని ఎన్ని ఎకరాలకు వేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున నాలుగు లక్షల ఇండ్లు మంజూరు చేశామంటున్నారని, అందులో ఎన్ని పూర్తయ్యాయో ఎన్ని పెండింగ్ ఉన్నాయో స్పష్టం చేయాలని కోరారు. గత పాలకుల తీరులోనే కాంగ్రెస్ పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు ఇవ్వాలన్నారు. అర్హులకు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం జూలై 10న వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా ఉందని జులై ఆరవ తేదీన ఇందిరాపార్క్ వద్ద ఇదే విషయమై ధర్నా ఉందని విజయవంతం చేయాలన్నారు. జూలై 10 ,11, 12 తేదీల్లో వనపర్తి లో ఉమ్మడి జిల్లా సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి తదితరులు హాజరవుతున్నారని విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్ ,రమేష్, మోష, నరసింహ శెట్టి, శ్రీహరి, గోపాలకృష్ణ, శేఖర్, శివకుమార్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
