ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ యోగా సాధన చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
యోగాతో ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించగలరని.. కాబట్టి నిత్యం యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో యోగా శిక్షకురాలు సుగుణ సుమారు 40 నిమిషాల పాటు యోగా సాధన చేయించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ అందరికీ “యోగా డే” శుభాకాంక్షలు తెలిపారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం మన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. యోగా ఒక్కరోజు నిర్వహించి మానేసే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు. శారీరక దృఢత్వం ప్రతి ఒక్కరికీ అవసరమని, రాబోయే రోజుల్లో యోగాతో పాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో కీలకమని, ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.
నషా ముక్త్ భారత్ ఏర్పాటు కై ప్రతిజ్ఞ నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో ఉమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, డీఎస్పీ గిరి ప్రసాద్, యోగ శిక్షకురాలు సుగుణ, జిల్లా రవాణా అధికారి, ఆయుష్ శాఖ అధికారులు వసుంధర , విశ్వశాంతి ప్రతినిధులు, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ సరస్వతి, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
