యాత్ర విషాద బాధితులకు ఎమ్మెల్యే మేఘా రెడ్డి అండ
వనపర్తి
తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్రలో సోమవారం రోడ్డు ప్రమాదంలో వనపర్తి పట్టణానికి చెందిన చీర్ల శ్యామ్ సాగర్ (స్వామి) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన వనపర్తికి చెందిన బాధితులను స్వస్థలానికి తీసుకురావడం, మృతదేహాన్ని వనపర్తికి తరలించడం, బాధిత కుటుంబాలపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే స్పందించారు. బాధితుల రవాణా, చికిత్స, మృతదేహం తరలింపు తదితర అత్యవసర ఖర్చుల కోసం మొత్తం రూ.1.15 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తాను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి అందించిన సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా ఎమ్మెల్యే స్పందనను అభినందించారు.
