ఇందిరా మహిళా శక్తితో మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదగాలి
వనపర్తి
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి, ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం రేవంత్ ఆశయమని మహిళలు దిశగా ముందుకెళ్లాలని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొత్తకోట మండలం విలియం కొండ గ్రామ శివారులోని ఫంక్షన్ హాల్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో కొత్తకోట మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అదేవిధంగా ఇద్దరు లబ్ధిదారులకు షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి, ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం రేవంత్ ఆశయమని మహిళలు దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలని కోటీశ్వరుని చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను, బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాల సభ్యురాళ్లకు ప్రమాద బీమా, 200 యూనిట్ల ఉచిత కరెంటు సహా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో పాఠశాలల్లో విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేయనుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా నేడు మీరాశి పల్లి గ్రామ శివారులో మహిళా సంఘాల ద్వారా ఎకరా స్థలంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో పెట్రోల్ బంకు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కొత్తకోట మదనాపూర్ మండలం మహిళా సమాఖ్యల ద్వారా రెండు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి నడపడం జరుగుతుందని వాటికి ఈ రోజే ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో కొత్తకోట మదనాపూర్ మండలాల సమాఖ్యల ద్వారా రెండు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో నడపడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాకుండా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు అనేక ఉపాధి వ్యాపార అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు. ఏదైనా వ్యాపారంపై ఆసక్తి కలిగిన మహిళలు ఉంటే వారు ముందుకు వస్తే ప్రభుత్వం శిక్షణ ఇప్పించి వ్యాపారం పెట్టించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సునీత పల్లవి, డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
