ప్రజా చైతన్యంలో కళలది ప్రత్యేక పాత్ర: వంక గోపాల్
వనపర్తి
సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేయటంలో కళలకు ప్రత్యేక స్థానం ఉందని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంకా గోపాల్ అన్నారు. బుధవారం వనపర్తి ఆఫీసులో ప్రజానాట్యమండలి నాలుగవ రాష్ట్ర మహాసభ గోడపత్రికలను కళాకారులు, నేతలతో కలిసి ఆవిష్కరించారు. మాట్లాడుతూ.. ఒక గొప్ప ఉపన్యాసం కంటే పాట, నాటకం, ఒగ్గు కథ, గొల్ల సుద్దులు వివిధ రూపాల కళలు ఎక్కువగా ప్రజలను కదిలిస్తాయన్నారు. అందువల్ల జిల్లాలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళలు కళారూపాల అభివృద్ధికి విశేష కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా చైతన్యంతో పాటు పార్టీ అభివృద్ధికి కళలు పట్టుగొమ్మలుగా ఉపయోగపడతాయని, జిల్లాలో కళాబృందాల ఏర్పాటుకు అందరూ తోడ్పాటు అందించాలన్నారు. జీవితకాలం ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచిన వృద్ధ కళాకారులు జీవించలేని స్థితిలో ఉన్నారని వారిని ఆదుకునేందుకు పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇండ్లు, ఇళ్లస్థలాలు మంజూరిలో వారికి ప్రత్యేక కోటా కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆవిర్భావం మే 25న జరిగిందని, ఆరోజు హైదరాబాద్ మగ్దుంభవన్ లో రాష్ట్ర నాలుగవ మహాసభ జరుగుతుందని 26న ప్రతినిధుల సభ ఉంటుందని జిల్లా కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కళావతమ్మ, శ్రీరామ్, రమేష్, కృష్ణవేణి, జయమ్మ, గంధం నాగరాజు,శేఖర్, చిన్న కుర్మన్న, వంశీ తదితరులు పాల్గొన్నారు.
