రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొంటాం – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
వనపర్తి
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సివిల్ సప్లై అధికారి, వ్యవసాయ, కోపరేటివ్, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐ. కె.పి. సహకార సంఘాల వడ్లు కొనుగోలు కేంద్రాల సభ్యులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి వరి కొనులు ప్రక్రియను సమీక్షించారు. రైస్ మిల్లులో ధాన్యం త్వరగా దించుకోకుండా రోజుల తరబడి లారీలు ఆగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయకపోవడం పై వివరాలు అడిగారు. లారీల్లో తెచ్చిన వడ్లు నాణ్యత లేవని, తాలు, చెత్త ఎక్కువగా ఉండటం వల్ల ఎఫ్.సి.ఐ కి నాణ్యమైన బియ్యం తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, అందుకే రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నట్లు మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ రైతులు సైతం సహకరించి తూర్పారబట్టిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని నాణ్యమైన వడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లు వచ్చిన లారీలను త్వరగా ఖాళీ చేసి పంపించాలని, రోజుల తరబడి మిల్లుల వద్ద ధాన్యం లారీలు పెట్టుకోవద్దని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, అకాల వర్షాలు ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి రబీ కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథ్, డి.సి.ఓ రాణి, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐ.కే.పి, సహకార సంఘం కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
