స్థానిక సమస్యలపై సిపిఐ పోరుబాట : సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయ రాములు
వనపర్తి
అమరచింత మునిసిపాలిటీ, మండలంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యలపై సిపిఐ పోరుబాట కొనసాగిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కే.విజయరాములు తెలిపారు.శనివారం అమరచింత పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ పార్టీ మండల కమిటీ సమావేశాన్ని ఏ అబ్రహం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కే.విజయరాములు మాట్లాడుతూ మున్సిపాలిటీలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని వాటి పరిష్కారం అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. 15 కోట్లతో చేస్తున్న పనులు నాసిరకంగా ఉన్నాయని వాటిపైన సంబంధిత అధికారులు విచారణ చేసి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అమరచింత మండలంలోని వివిధ గ్రామా లలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని ఆరోపించారు. రైతులు కూలీలు ప్రజలు పనులు లేక తీర ఇబ్బందులకు గురవుతున్నారని వారికి ఉపాధి కల్పించాలని కోరారు. గ్రామాలలో ముఖ్యంగా తాగునీటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి పరిష్కారం దిశగా యంత్రాంగం పనిచేయాలని కోరారు. తాగునీటి కోసం రైతులు జూరాల గేట్లు తెరిస్తే వారిపై కేసులు పెట్టడం సరికాదని రైతులు రౌడీలు కాదని వారిపై పెట్టిన నాన్ బయిల బుల్ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్నికల కమిషనర్ సర్ పేరు మీద 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని ఆరోపించారు. 13 కోట్ల మంది ఎక్కడున్నారని అనాలోచితం నిర్ణయాలు చేస్తున్న ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని అర్హులైన వారు ఉన్నప్పటికీ అరకొరగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఇల్లు కేటాయిస్తున్నారని ఇండ్ల మంజూరు సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పైన పేర్కొన్న సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరుబాట నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం,శ్యాంసుందర్, కే.లక్ష్మీనారాయణ, ఆంజనేయులు,యం.డీ.కుతూబ్ తదితరులు పాల్గొన్నారు.
