సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
వనపర్తి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వనపర్తి నంది హిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన గొప్ప ప్రజా యోధుడని కొనియాడారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి, ఆనాటి అణచివేత, దోపిడీ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని అన్నారు. సామాన్య ప్రజలను ఏకం చేసి వారికి అండగా నిలిచిన పాపన్న గౌడ్, బలహీన వర్గాలకు ఆత్మవిశ్వాసం కల్పించారని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన ఆయన స్ఫూర్తి నేటి తరానికి కూడా ఆదర్శమని తెలిపారు. తెలంగాణ గడ్డపై ప్రజల కోసం పోరాడిన వీరుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు . సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
