ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి
ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆస్తులు కూడబెట్టడం కంటే, వారికి అందించగలిగే గొప్ప ఆస్తి నాణ్యమైన విద్య అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యా రంగ అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రపంచంలో విద్యా రంగంలో ముందంజలో ఉన్న జపాన్, జర్మనీ, ఇండోనేషియా వంటి దేశాల విద్యా విధానాల్లోని ఉత్తమ పద్ధతులను తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఆధునిక విద్య, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా పోటీ పడేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తని, నేటి విద్యార్థులను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జిల్లా నాయకులు బ్రహ్మం చారి, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
