కనీస వేతనం 26,000 పెంచాలి
వనపర్తి
మూడు సంవత్సరాల కాల వ్యవధి ముగిసి కాలం చెల్లిన ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేయకుండా ప్రభుత్వం వాటికే అనుమతి పెంచుతూ పోవడం పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల సంక్షేమానికి గొడ్డలి పెట్టు లాంటిదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారిశుద్ధ్య సెక్యూరిటీ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల జాయింట్ సమావేశం జరిగింది. అనంతరం కార్మికుల తక్షణ దీర్ఘకాలిక సమస్యలపై, సంబంధిత ఏజెన్సీ యాజమాన్యం,యూనియన్ నాయకులు, కార్మికుల మధ్య చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఏజెన్సీలను మూడు సంవత్సరాల వ్యవధితో ఎంపిక చేసి కార్మికుల జీతభత్యాలు నిర్ణయించి అమలు చేస్తున్నారని అన్నారు. మూడు సంవత్సరాల వ్యవధి ముగిసి ఏడాది గడసిపోయిన కూడా నేటికీ ఏజెన్సీలను రద్దు చేయకుండా వాటి స్థానంలో కొత్త ఏజెన్సీలను ఎంపిక చేయకుండా కాలయాపన చేస్తూ పాత వారికి అనుమతులు ఇవ్వడం చేత కార్మికులకు మూడేళ్లకు పెరగాల్సిన జీతాలు పెరగకపోగా తీవ్రమైన ఆర్థిక నష్టంతోపాటు, ఆస్పత్రుల మెడికల్ కళాశాల నూతన భవనాలు, వార్డులు పడకల సామర్థ్యం అనుగునంగా కార్మికుల సంఖ్య పెరగలేదని దీనితో కార్మికులకు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల వ్యవస్థను రద్దుచేసి నేరుగా కార్పొరేషన్ ద్వారానే వేతనాలు అందించాలని, కనీస వేతనం 26వేలకు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జాతీయ పండగ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి యూనిఫార్మ్స్ బూట్లు క్రమం తప్పకుండా అందించడం కాకుండా కార్మికులకు భద్రతవస్తువులైన గ్లౌజ్ లు, బెల్లం, కొబ్బరి, నూనె, సబ్బులు అందించాలని, నాణ్యమైన క్లీనింగ్ రసాయన వస్తువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు లక్ష్మి, మన్నెమ్మ,భారతి, సహిదా బేగం,బొజ్జమ్మ,పిర మ్మ, శ్రీదేవి భూదేవి శారద సుజాత, జయలక్ష్మీ, గోవిందమ్మ,శ్రీ గంగా, పుష్ప, నరసింహ,మద్దిలేటి, షంషిద్దీన్,కృష్ణ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
