విద్యా వ్యాపార మాఫియా దోపిడికి అడ్డుకట్ట వేయాలి
వనపర్తి
రాజ్యాంగ ప్రాథమిక హక్కులో భాగమైన ఉచిత విద్యను అంగడి సరుకుగా మార్చి కొత్త కొత్త టెక్నాలజీ పేర్లతో పవిత్రమైన విద్య వ్యవస్థను స్వార్థపూరిత కుట్రలతో విద్యను వ్యాపారం చేసిన విద్య మాఫియా దోపిడీలపై ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతూబ్ డిమాండ్ చేశారు. ఆదివారం అమరచింత మండల కేంద్రంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)అమరచింత మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం.డి కుతూబ్ మాట్లాడుతూ కేజీ నుండి పేజీ వరకు ఉచిత విద్య అనే పాలకుల నినాదం కేవలం మాటలకే పరిమితం అయ్యాయని, విద్య హక్కు చట్టంలోని సూత్రాలు, ఫీజుల నియంత్రణ జీవోలు కేవలం పరిపాలన శాఖల పేపర్లకు మాత్రమే పరిమితం చేశారని మండిపడ్డారు.నాణ్యమైన విద్య పేరుతో ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్డు అదుపు లేకుండా ఫీజులు దండుకుంటున్న విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతు వేసవిలోనే ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులకు టార్గెట్లు పెట్టి ఇంటింటా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై, ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా గెలుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎన్ని విద్య సంస్థలు సీజ్ చేశారో తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు జలగళ్ల ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఏ ఒక్క ప్రైవేటు విద్యా సంస్థ నడవడం లేదని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు దోపిడీ ఆపకపోతే ప్రత్యక్ష దాడులకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మహమూద్,దయాకర్, అరుణ్,మల్లేష్ యాదవ్, శ్రీకాంత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
