యువత చెడు వ్యసనాలకు బానిసలుగా కాదు…చెడు రాజకీయాలను చెండాడే సైనికులవ్వాలి
వనపర్తి
దేశ గతిని మార్చే యువత శక్తి చెడు వ్యసనాలకు బానిసలుగా కాకుండా నీతి నిజాయితీ సేవా దృక్పథానికి కలంఖంగా మారిన చెడు రాజకీయ వ్యవస్థను చెండాడే సైనికులు దేశ యువత కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం అమరచింత మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వనపర్తి జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు మాట్లాడుతూ:- పాలకులు దశాబ్దాల తరబడి యువతను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా మాత్రమే ఉపయోగిస్తూ యువత ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత యువత శక్తి యుక్తులు నిర్వీర్యం చేసే విధానాలను అవలంబించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.60 శాతం పైగా యువత ఉన్న ఏకైక దేశం భారత్ అని అన్నారు.యువత నైపుణ్యాలను గుర్తించి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా బానిసలుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని 12 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కులం,మతం,ప్రాంతీయ విద్వేషాలతో యువత మెదల్లను కల్మషం చేస్తున్నారని అన్నారు.జాతీయ సమగ్ర యువజన విధానం ప్రకటించాలని, యువతకు ఎలాంటి బ్యాంకు షూరిటీలు లేకుండా స్వయం ఉపాధి రుణాలు అందివ్వాలని, ప్రతి నియోజకవర్గంలో నూతన పరిశ్రమలు నెలకొల్పి స్థానికుల యువతీ యువకులకు 80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులైన విద్యా వైద్యం ఉపాధి హక్కులకై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్,ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి.కుతూబ్, ఏఐవైఎఫ్ నాయకులు నరసింహ, మహిముద్,శ్రీకాంత్,రవి, చంద్రయుడు,నరేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
