రాష్ట్రంలోనే వనపర్తిని మోడల్‌గా తీర్చిదిద్దుతా
వనపర్తి
రాష్ట్రంలోనే వనపర్తిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. ప్రజాపాలన 99 ప్రగతి ప్రణాళిక వార్డు సభ కార్యక్రమాన్ని గురువారం కర్రెమ్మ గుడి వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేయకముందే తాను ప్రజలకు సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకటించానని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి ఆస్తులు కూడగట్టుకోవడానికి రాలేదని, ప్రజలకు సేవకుడిగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. అధికారం ఉందనే అహంకారంతో పేదల భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ట్రస్ట్ భూములు, గుట్టలను ఆక్రమించుకోవడం అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యమని ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సహకారంతో వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెడతామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికై అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7 2023న ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే మొదటగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మొదటి సంతకం చేసిందన్నారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటివరకు 30.29 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ధర చెల్లించడం జరిగింది అన్నారు. ఆరోగ్య భీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు పై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వము విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, అల్పాహారం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 6000 మంది కొత్త టీచర్లకు నియామకం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో రూ. 207 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి మంజూరీ చేసినట్లు చెప్పారు. ఐ.టి. టవర్, పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సి.సి రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. త్వరలో వనపర్తి మహిళలకు డీజిల్ బంక్ మంజూరు కాబోతుందని, 546 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, ప్లాట్లు లేని నిరుపేదలకు 1000 ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వానికి తాను ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా అన్ని పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పుర కౌన్సిలర్లు శరవంద, వెంకటేశ్వర్లు, పాకనాటి కృష్ణ, మురళి సాగర్, నిర్మలమ్మ, అయేషా సిద్ధిఖ, సౌమ్య, ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, మెప్మా, సానిటేషన్ ఇన్స్పెక్టర్, పలువురు పాల్గొన్నారు.
