ప్రశ్నించే గొంతుకలకు మతం ఉరి : శ్రీరామ్
వనపర్తి
ప్రశ్నించే గొంతుకలకు బిజెపి మతం ఉరి వేస్తోందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ వనపర్తి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరామ్, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ఆరోపించారు. శనివారం వనపర్తి పార్టీ ఆఫీస్ ఆవరణలో జాతీయ పార్టీ పిలుపుమేరకు ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ పోస్టర్లను ఆవిష్కరించారు. హిందుత్వ, రామ మందిరం పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజా సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నారు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను మతం దేవుని పేరు చెప్పు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాక్రో జనతా పార్టీ యువత నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో ఆందోళన చేస్తే క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేసిన చివరకు ప్రభుత్వం దిగివచ్చి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరించక తప్పలేదు అన్నారు. మార్పు మొదలైందని ప్రజలు తిరగబడితే తలవంచక తప్పదు అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను, అధిక ధరలు తగ్గిస్తామని సామాన్యులను, స్విస్ బ్యాంకు నుంచి నల్లదనం వెనక్కు తెచ్చి ప్రతి రైతు ఖాతలోరూ. 15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. స్వాతంత్రానికి ముందు నుంచి నేటి వరకు కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా విభజించి నిర్వీర్యం చేశారన్నారు. పారిశ్రామికవేత్తలు సంపన్నులకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకు రోజుకి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచారన్నారు. అమెరికాతో స్వేచ్ఛ వ్యాపార ఒప్పందంతో రైతులకు ఉరితాలు పేనారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వి బి జి రాంజీగా మార్చి మార్చి, 90% గా ఉన్న కేంద్ర వాటాను 40 కి తగ్గించుకోవడంతో పథకం ప్రమాదంలో పడిందన్నారు. వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. వనపర్తి లో చైతన్య యాత్ర ఆగస్టు 9 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ముగింపుగా సెప్టెంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, నేతలు కళావతమ్మ, రమేష్, మోష, శ్రీ రామ్, పృధ్వి నాదం, శేఖర్, చిన్న కుర్మన్న, వంశీ, శిరీష, లక్ష్మీనారాయణ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
